అమ్మ కథలు - నాలుగవది
కంచిలో మంచి మొగుడు
అనగనగా ఒక ఊళ్ళో ఓ దోమ ఉండేది. ఓ నాడు దానికి పెళ్ళి చేసుకోవాలని కోరిక పుట్టింది. ఇంకేం!! వెంటనే కంచికి బయలు దేరింది మంచి మొగుణ్ణీ వెతుక్కోవాలని. వెళ్ళగా వెళ్ళగా దార్లో ఒక కాకి కనవడింది.
"దోమ బావా! దోమ బావా!! ఎక్కడికేడుతున్నాబు?" అంది.
దోమ గిరుక్కున మొహం తిప్పేసుకుని
"కంచిలో మాంఛి మొగుణ్ణీ వెతుక్కోవటానికి వెడుతున్నానూ" అంది వంకర్లు పోతూ, గుడ్లుతిప్పుకుంటూ.
పాపం కాకి మాత్రం అమాయకంగా కావు-కావు మంటూ బోల్డు కబుర్లు చెప్పి "పోనీ నన్ను చేసుకోరాదూ" అంది.
దోమకి ఒళ్ళు మండింది.
"ఉ(!! కాకిష-కారు నలుపుష - తన్నుష - నేనుష - పెండ్లాడేదష" - అని మూతి విరిచేసింది.
ఇంకొంచెం దూరం వెళ్ళాక, ఈ సారి ఓ పిచ్చిక ఎదురయింది. అదీ అల్లాగే అడిగేసరికి దోమ తన విషయం చెప్పింది. పిచ్చిక ముద్దు ముద్దుగా కిచ కిచ లాడుతూ "నిన్ను నా రెక్కల మీదకెక్కించుకుని క్షణాల్లో ఆకాశమంతా తిప్పేస్తాను, నన్ను చేసుకోవా" అని అర్థించింది. మళ్ళీ దోమ తిప్పుకుంటూ......
"పిచికష - పిల్లవాడుష - తన్నుష - నేనుష - పెండ్లాడేదష" అని వయ్యారాలు పోతూ గర్వంగా వెళ్ళిపోయింది.
ఇంకా ఇంకా కొంతదూరం వెళ్ళాక. ఒక పేద్ద ఎద్దు కనబడింది. విషయం తెలుసుకున్నాక ఎద్దు అంటూంది కదా "చూడు దోమ బావా!! నేను బొద్దుగా, తెల్లగా, బలంగాఉన్నాను. పొద్దంతా పొలం దున్నమన్నా బండ లాగ మన్నాకూడ సంతోషంగా చేసేస్తాను. నీ యిష్టం, గానుక్కైనా కట్టేసుకో, ఫరవాలేదు. ఇంకేం. నన్ను పెళ్ళి చేసుకో. కంచి అంత దూరం పోవటం ఎందుకు?" అని ఎన్నో సుద్దులు జెప్పింది. దోమ కి వేవీ చెవికెక్కలేదు. సరికదా
"ఎద్దుష - మొద్దుమొహముష - తన్నుష - నేనుష - పెండ్లాడేదష" అని అల్లల్లల్లా - అంటూ నాలిక బయట పెట్టి ఎక్కిరించి చక్కా పోయింది.
ఇంకాస్త దూరానికి పోయాక ఒక గ్రద్ద ఎదురయ్యింది. అది ఊడ పాపం అమాయకంగానే తన సుగుణాలన్నీ ఏకరువు పెట్టుకుంది. గ్రతిమాలుకుంది. బామాలు కుంది. దోమ గీర మరి కాస్త పుంజుకుంది.
"గ్రద్దష - మొద్దుముఖముష - తన్నుష - నేనుష - పెండ్లాడేదష" అని మూతి అష్ట వంకర్లూ తిప్పింది. ఆఖరుకి రాత్రయింది. కటిక చీకటి. దోమ అలసి పోయి, సొలసిపోయి ఓ చెట్టు మీదికి చేరుకుంది. ఆకలి దంచేస్తోంది. అక్కడే ఓ కొమ్మమీద ఒక కోతి నిద్ర పోతూ కనిపించింది. వెంటనే దోమ ఎగిరి దాన్ని కుట్టి జుర్రున రక్తం పీల్చి కడుపు నింపుకుందో లేదో కోతి మేలుకుంది. దోమ "గు(య్" అంటూ ఎగిరింది.
కడుపు నిండింది కదా!! మళ్ళీ పెళ్ళి మీదికి ధ్యాస మళ్ళింది. మెల్లిగా దోమ కోతి మొహం చుట్టూ చుట్టి పరికిస్తోంది. చెవుల్లో జోరీగలాగ పాడుతోంది. ఎర్రని కోతి మొహం చూసి మురిసి పోతూ. ఈల కొడుతోంది. దోమకి కోతి బాగా నచ్చేస్తోన్నట్టేఉంది. హుషారుగా కోతి మొహం చుట్టూ గంతులేసి నాట్యమాడేస్తోంది. కోతి పాపం నిద్రమత్తులో విసుగ్గా అటూ-ఇటూ దొర్లుతోంది. దోమ కోతిబావను ఎల్లాగయినా లేపేసి తన కథంతా చెప్పాలనుకుంది. మెల్లగా చెవుల్లో చేరి
"కోతి బావా!! ఇదే ఊరు?" అని అడిగింది.
కోతి మత్తుగా "కంచి" అంది.
దోమకి హుషారు జోరైంది.
"కంచి" కాబట్టే ఇంత "మంచి మొగుడు" దొరికాడని బోలెడు మురిసి పోయింది. కోతి ముఖం అంతా ఎగిరెగిరి తన కథంతా వివరిస్తోంది. హఠాత్తుగా దగ్గరగా వచ్చి ముద్దుగా, ముచ్చటగా, రహస్యంగా "నన్ను పెళ్ళాడుతావా?" అంటోంది. అంతే!! కోతి ఉలిక్కిపడి లేచి గట్టిగా గాలి పీల్చుకుంది. ఇంకేముంది. దోమ కోతి ముక్కులో దూరిపోయి ఇరుక్కుపోయింది. కోతికి పూర్తిగా మెలుకు వొచ్చేసి కథంతా తెలిసిపోయింది. ఇంక బుర్ర గోక్కుంటూ "ఇదెక్కడి తంటారా బాబూ! నేనెందుకు కంచిలో పుట్టానా!! నేనే మంచి వాణ్ణైపోయ్యానా!! నాముక్కులో ఈ దోమ గుల గుల్లాడి పోతూంటేనే నేనెంత గిలగిల్లడినా ఏ లాభం!! దేవుడా!!" అంటూ........
అసలే కోతి కదా, ఇంక చిందులాడుతూ తందనాలు దొక్కుతూ, ముక్కు చీదుతూ పాట అందుకుంది.............
"కాకిష - కారు నలుపుష - ఖూ( దోవ(న్నా"
"పిచికష - పిల్లవాడుష - ఖూ( దోవ(న్నా"
"ఎద్దూ - మొద్దూ ముఖముష - ఖూ( దోవ(న్నా"
"గ్రద్దా - ఎద్దూ ముఖమూష - ఖూ( దోవ(న్నా"
అంటూ పాడగా, పాడగా గఠ్ఠిగా "ఖూ( " అంటూ ముక్కు చీదగా, చీదగా దోమ చచ్చి పోయి కిందికి ఊ..........డి పడింది.
అందుకే "కథ కంచికి మనం ఇంటికి" అనటం వచ్చిందిట.
నీతి: ఇదర్రా పిల్లల్లూ!!! వంద "హిరణ్యాక్ష" వరాలతో పెళ్ళి చూపుల కెళ్ళే వధూవరులకి గుణ పాఠం లాంటి ఓ హాస్య కథ!!! చూసారా!! ఇందులో ఎన్నో మానవతా విలువల్ని జోడించారు.
No comments:
Post a Comment