Friday, April 15, 2011

అమ్మ కథలు మొదటిది- ౨౬.౦౨.౨౦౧౦, శుక్రవారం



అమ్మ కథలు మొదటిది- ౨౬.౦౨.౨౦౧౦, శుక్రవారం


ఇనప అత్తగారు


అనగనగా ఒక ఊళ్ళో ఒక పేద్ధ ఇల్లుండేది.  ఆ ఇంట్లో ఒకాయన - ఆవిడ ఉండేవారు.  వాళ్ళ కిద్దరు కొడుకులు.  వాళ్ళ చదువులు-ఉద్యోగాలు, తరవాత పెళ్ళిళ్ళూ అయి పోయి సుఖంగా కాపురాలు చేసుకుంటున్నారు.  ఇంతలో ముసలాయనకి జబ్బు చేసి చనిపోయాడు.  పెద్దావిడని ఎవరు చూసుకోవాలా అని ఇద్దరు కొడుకులూ వంతులు పోతున్నారు.  వాదులాడు కుంటున్నారు.  అప్పుడు ఊరిపెద్దలందరు కూడి తీర్పు చెపాలని నిర్ణయించుకున్నారు.  


ఆస్తులన్నీ చెరో సగం చేసి ఇద్దరు కొడుకులకూ ఇచ్చారు.  ఇంటికి మధ్యగా ఒక తడిక కట్టించి రెండు వాటాలుగా మార్చించారు.  అత్తగారి నగలన్నీ కూడ కోడళ్ళకి పంచి ఇచ్చారు.  ఇక పెద్దావిడ మాత్రం పెద్దకొడుకు దగ్గరే ఉండాలని తీర్పుచెప్పారు.  
స్వతహాగా చిన్న కొడుకు సౌమ్యుడు - మంచివాడు.  అతనికి అగినట్లే భార్య కూడ మంచిది.  కానీ చాలా అమాయకురాలు.  అత్తయ్యా - అత్తయ్యా అంటూ ఎప్పుడూ అత్తగారి వెనకాలే తిరుగుతూ, అన్నీ అందిస్తూ - సేవచేస్తూ ఉండేది.  పెద్ద కొడుకు కూడ మంచివాడే కాని బొత్తిగా పెళ్ళాం భక్తుడు.  ఇంక ఆమె మాటే వేదం.  పెద్ద కోడలు మాత్రం పరమ గయ్యాళి.  దానికి తోడు అన్ని దుర్గుణాలూను.   మహా గడుసుది కూడ.  అందుచేత పెద్దలమాట మన్నిస్తున్నట్లు పైపైకి అన్నీ ఒప్పుకుంది.  కాని లోపల - లోపల అత్తగార్ని నానా తిప్పలు పెట్టేది.  ఆవిడకి వసతులు - సేవలు మాట అటుంచి తిండి - బట్ట కూడ సరిగ్గా ఉండేవి కావు.  పైగా ఇంటి పనీ - వంట పనీ కూడ ఆమె మీదే వదిలి తను మాత్రం ఠింగురంగా అని తిరిగొచ్చేది.  పైగా తనకే ఎక్కువ భాద్యతలు చుట్టుకున్నాయని వాపోయేది.


చిన్న కోడలు మాత్రం "అత్తగారుండాలని నాకెంతో ఇష్టం కదా - ఆమెను వాళ్ళ వాటాకేసారేంటి?" అని మహా విచారించేది.  ఆమాటే భర్తతో చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకుంది.  అతడు చూడలేక ఒక పెద్ద "ఇనప బొమ్మ" అత్తగారంత సైజులో పోత పోయించి భార్యకిచ్చాడు.  ఇంక ఆమె సంతోషంతో గంతులేసి ఆ బొమ్మకి స్నానం చేయించి కొత్త బట్ట కట్టి ఇంటి మద్యగా కట్టిన తడిక దగ్గరగా పీటమీద కూచోబెట్టింది.  పిండి వంటలతో సహా విస్తరినిండా వడ్డించి తృప్తిగా వెళ్ళి తాను కూడ వంటింట్లో భోంచేస్తోంది.  ఆ గడుసు పెద్దకోడలు తడికలోంచి అంతా కనిపెడుతూనేఉంది.  గబగబా తడికలో సందుచేసి అత్తగారి విస్తరి ఖాళీ చేసేసింది.  అత్తయ్యా అప్పుడే భోజనం అయిందా అంటూ చిన్న కోడలొచ్చి చెయ్యి - మూతి కడిగి అడుకోబెట్టింది.  రాత్రికి రాత్రి పెద్దకోడలు అత్తగారి మాసిపోయిన బట్ట బొమ్మకి కట్టి కొత్తది తెచ్చేసుకుంది.  అయ్యో!! అత్తయ్యా అప్పుడే చీర మాసిపోయిందా అంటూ ఇంకో కొత్త చీర కట్టి ఇది ఉతికి వేసేది ఆ అమాయకురాలు.  ఇలాగ పెద్ద లోడలి గడుసు తనంతోను - చిన్న కోడలి వెర్రితనంతోను రోజులు గుట్టుగా గడుస్తున్నాయి.


ఒక రోజు చిన్న కొడుకు ఇంటి ఖర్చులు చూసి గుండె గుభేల్లు మంది.  ఉండేది ఇద్దరమేగా...ఇంత ఖర్చేమిటే అని భార్యని నిలదీశాడు.  ఇప్పుడు అత్తగారొచ్చారు కదండీ అంటూ ఆవెర్రిబాగుల్ది సాగదీసింది.  ఇనప బొమ్మకి ఖర్చేమిటని ఆరా తీసి, అసలు సంగతి గ్రహించి, భార్యను తిట్టిపోసాడు.  కాని ఈమె పిచ్చి మాత్రం వదల్లేదు సరి కదా ఎక్కువైపోయింది.  అతనింక సహించలేక ఓ రాత్రి ఆ ఇనప బొమ్మని బైటకి విసిరేసాడు.  వెంటనే ఆమె అయ్యో!! అయ్యో!! అత్తయ్యా!! - అత్తయ్యా!! అని ఏడుస్తూ బైటకెళ్ళేసరికి అతనికి ఒళ్ళు మండి తలుపు భళ్ళున వేసేసాడు.  


ఆ రాత్రి పాపం ఆ వెర్రికోడలు  అత్తగార్ని చంకనేసుకుని ఏడుస్తూ పోతోంది.  చీకటి. జోర్న వాన.  ఊరిబయట  పొలాల్లో ఓ పేద్ద మర్రి చెట్టు ఎక్కి కొమ్మల్లో తలదాచుకుంది.  కోడి కూసే వేళకి కోందరు దొంగలు వచ్చి ఆ చెట్టు కింద రహస్యంగా దొంగ సొమ్ము పంచుకుంటున్నారు. పైన నిద్దరొచ్చేసిన కోడలు ఒళ్ళోచించి ఇనప బొమ్మ జారిపోయి వాళ్ళ నెత్తిన పడింది.  ఇంక ఆ దొంగలు హడులెత్తి లబొదిబోమంటూ పారిపోయారు.  కోడలికి మెలుకువొచ్చి అయ్యో! అత్తగారూ పడిపోయారా అనుకుంటూ దిగి చూస్తేఏముంది?  జిగేల్ మంటూ నగలు - డబ్బు.  హాయిగా మూటగట్టుకుని - అత్తగార్ని చంకనేసుకుని పొద్దున్నే ఇంటికి తయారు.


ఇదంతా చూసి గడుసు పెద్దకోడలి బుర్రలో దురాశ ఆకాశంలోకి పర్వతంలా లేచేస్తోంది.  దానికి తోడు చిన్న కొడుకు భార్య మీద జాలితో అన్నగారి దగ్గరకెళ్ళి అమ్మని తన ఇంటికి పంపించేయమని ప్రాధేయపడ్డాడు.  పెద్దకోడలికి వెతకబోయిన తీగకాలికి తగిలినట్లయింది.  చటుక్కున ఒప్పేసుకుని ఇనప బొమ్మని తను తీసేసుకుంది.


రోజూ రాత్రి కాగానే బొమ్మేసుకుని చెట్టేక్కేసేది.  చీమలు, దోమలు, పాములు అన్నీ భరించేది.  ఆ దొంగలకి దెబ్బలు తగ్గి పోయాక అసలేం జరిగిందో ఆ రాత్రి అని తెలుసుకోడానికి కర్రలతోను - కాగడాలతోనూ వచ్చి గాలించారు.  ఇంకేముంది ఈ గయ్యాళి - గడుసు కోడలు ఇనప బొమ్మతో సహా దొరికి పోయింది.  ఇంక ఆ దొంగలు కోపం పట్టలేక ఎఆమెని కర్రల తో బాది - కాగడాల్తో కాల్చి నానా తిట్లు తిట్టి ఈడ్చిపారేసారు.  


పిల్లలూ కథ కంచికీ - మనం ఇంటికీ!!!!


నీతి:  అతి తెలివి - గయ్యాళితనం - దురాశ లాంటి గుణాలు పెంచుకుంటే ఏమవుతుంది మరి!!! అంతే శాస్తి.





No comments:

Post a Comment