Sunday, April 17, 2011

అమ్మ కథలు - ఐదవది - చీమ - చిలుక కథ



అమ్మ కథలు - ఐదవది


చీమ - చిలుక కథ


అనగనగా ఒక ఊరు.  ఆ ఊల్లో మధ్యగా ఓ పేద్ద చెరువు.  చెరువు గట్టు మీద ఇంకా పేద్ద రావి చెట్టు ఉండేవి.  ఈ చెట్టు తొర్రలో ఈ చీమ ఓ చిలుక కాపురం చేస్తూ ఉండేవి.  చీమ చిటుక్కు మన్నా చిలుక కిల కిలా పలికేది.   చిలుక కిసుక్కు మన్నా చీమ పుసుక్కున ఊడిపడేది.  ఇలా వాళ్ళ స్నేహం  చూడ ముచ్చటగా దినదినాభివృద్ధి నొందుతోంది.  ఇదిలా ఉండగా చీమా - చిలకా కలిసి ఒకనాడు పాయసం వండు కుందామనుకున్నాయి.  (అంటే పార్టీ చేసుకోవాలనిపించి అన్నమాట).  ఇంకేం, సరే అంటే సరే అనుకుని సాంబరాలన్నీ తెచ్చుకుని పాయసం చేసుకున్నాయి.


పాయసం చాలా వేడిగా మరిగిపోతోంది.  కానీ, భలే!!! ఘుమ ............... ఘుమ లాడి పోతోంది.  ఏలకు పొడి, జీడిపప్పు, కిస్ మిస్ లు .....ఓహ్!!! చీమ లి నోరూరిపోతోంది.  ఇంక ఆపుకోలేక పాయసం కాస్త రుచి చూద్దామనుకుంది.  అంతే!! గిన్నె మీదికి అమాంతం పాకేసి, కాస్త నోరు పెట్ట బోయిందో లేదో వేడి వేడి పాయసం లో పడి పోయింది.  చిలుక ఇంక ఆలోచించకండా ఆత్రంగా చీమ మీదకి ముక్కు దూర్చి బయటకి లాగి పడేసింది.
ఇంతా హఠాత్తుగా జరిగిపోయిన దాంట్లోంచి తేరుకుని  తీరా చూస్తే ఏముంది?  చీమ చచ్చిపోయింది.  చిలుక ముక్కూడిపోయింది.  ఇంకేముంది ఏడువు.  ఎవరు, పాపం మొండి ముక్కు చిలుకకి సాయం చేస్తారు?  ఆ ముక్కేసుకుని ఎవరికి కనిపిస్తుంది?  పాయసమంతా చల్లబడిపోయింది.  కానీ, చిలుక ఒళ్ళు మాత్రం మండిపోతోంది.  ఈ మూల ఉక్రోషం పట్టలేక బావురుమంటోంది.  చిందులేస్తోంది.  మొత్తుకుంటోంది.  "మో ఎవరికీ అపకారం చేయలేదు.  జాతి భేదాలు లేకుండా కలిసి మెలిసి ఉంటున్నాం.  హాయిగా జీవిస్తున్నాము.  ఊళ్ళో ఎవరికీ అడ్డు రావటం లేదు.  అనవసరంగా ఎవరి జోలిఈ పోము.  గౌరవంగా పోతూ ఉంటాము.  ఊరి కబుర్లతో ఉబుసుపోసుకోం.  పాపిష్టి చుప్పనాతి గుణాలు లేవు. ఎప్పుడైనా ఎవరినైనా ఆడిపోసుకున్నామా!! కష్టం - నష్టం కలిగించామా!!  ఈ మాత్రం సంవరానికైనా మేము నోచుకోలేదా?  నా స్నేహితుడి కింత ఘోర మరణం ఏమిటి?  నాకీ క్షోభ ఎందుకు? మేమేం పాపం చేసామని?" అంటూ ఆకాశంలోకి దేవుడికేసి చూస్తూ దుఃఖి స్తోంది.


ఇంతలో ఆ వూరి కరణంగారి కోడళ్ళు కిలకిలా నవ్వు కుంటూ - కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ చెరువు కొచ్చారు.  బిందెలు నింపుకుని గజ్జల పట్టాలు ఘల్లు ఘల్లు మంటూ వయ్యారంగా పోతున్నారు.  చెట్టు మీద ఆకుల్లో ఉన్న మెండి ముక్క చిలక దీనంగా మౌనంగా ఉన్నదల్లా చటుక్కున.


"కోడళ్ళ భుజాన బిందెలు  అతుక్కుపోవాలి" ఇంది.  అంతే!! వాళ్ళు ఇంటికెళ్ళి  దింపబోతే బిందెలు ఊడి రావాయ్!!! వాళ్ళ మామగారు పెద్ద పీట మీద కూర్చుని భోంచేస్తున్నారు.  అత్తగారు పెరుగు వడ్డిస్తోంది.  వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతూ గబగబా వచ్చి సాయం పట్టి దింపుదామనుకుంటునారో లేదో మొడి ముక్కు చిలక తుర్రున ఎదిరొచ్చి చూసి
"మామగారి ముడ్డికి పీట అతుక్కు పోవాలి"
"అత్తగారి చేతులకి గరిటతుక్కు పోవాలి"
అంది.  ఇదంతా చూసి వాళ్ళ పాలేరు మునసబుగారింటికి పరుగెట్టు కెళ్ళి చెప్పాడు.


ఆయన అప్పుడే భోజనం చేసి ఆరు బయట నవ్వారు మంచం మీద నడ్డి వాల్చారు.  మొండి చిలక పాలేరు కన్నా వేగంగా రివ్వున వచ్చేసి
"మునసబుగారి నడ్డికి మంచం అతుక్కుపోవాలీ"  అంది.  అప్పుడే ఊరి రైతులు పొలం నించి నాగళ్ళూ భుజాల్నేసుకుని వస్తూ ఈ వింతకి విస్తు పోతూ మునసబుగార్ని లేపబోతూన్నారో లేదో మొండి చిలక గ్రహించి "రైతుల భుజాలకి నాగళ్ళతుక్కుపోవాలి"  అంది.  ఇంకే ముంది.  ఊరంతా గగ్గోలు - గొడవ గోడవ!!!


ఇంక ఊరి పెద్దలంతా రచ్చ బండ దగ్గర చేరి ఆలోచించటం మొదలు పెట్టారు.  "ఈ విపరీతానికి మూలం ఏమయి ఉండొచ్చు. మన ఊళ్ళో అమాయకులైన మంచి వాళ్ళకెవరికో ఏదో అన్యాయంగా అపకారం జరిగి పోయిందేమో!!! ఎవరు వారు?  ఏమా సమాచారం!!!"  అంటూ ఊరంతా గాలించారు.  చివరకి చెరువు గట్టు తొర్రలో "చచ్చిపోయిన చీమ - మొండి ముక్కు చిలక" దీనగాథ తెలిసింది.  మరి అందరూ చాలా మంచి వాళ్ళే కదా!!! అయినా ఎవరు మాత్రం ఏమి చేయగలరు?  అయితే అందరూ కలిసి ముక్త కంఠంతో దేవుణ్ణి వేడుకున్నారు.  దేవుడికి కూద జాలి కలిగి దిగివచ్చి  ఆశీర్వదించారు.  అంతే!!! చీమ జర జరా ప్రాకింది.  చిలక ముక్కు అతుక్కుపోయింది.  సంతోషంగా చీమ - చిలకా నాట్యం చేస్తూ ఇలా పాడసాగాయి......


"కోడళ్ళ భుజాన బిందెలు ఊడిరానాలీ
మామగారి ముడ్డి కింద పీట ఊడిరావాలీ
అత్తగారి చేతికి గరిటే ఊడిరావాలీ
మనసబుగారి నడ్డికి మంచం ఊడిరావాలీ
రైతుల భుజాల నాగళ్ళు ఊడిరావాలీ"  అంటూ,
అందరూ ఆనందంగా ఎవరిళ్ళకి వాళ్ళు...............


కథ కంచికి ............... మనం ఇంటికి..........!!!!!!!!!!!!


అందుకే చిలుక ముక్కు మాత్రం "ఎర్రగా", "వంకరగా" అయిపోయింది.














No comments:

Post a Comment