అమ్మ కథలు - ఆరవది
ఈగ కథ
********* ఒకదాని కొకటి తగిలిస్తే గొలుసు అవుతుంది. దాన్నే పొడుగ్గా చేస్తే తోక అంటారు. అదే గొలుసు కత లేక తోక కథ అనొచ్చు. ఇది అలాటి కథే.......................
ఈగని ఇంగ్లీషులో "houseful" అంటారు. ఇక్కడ ఈగమ్మ అంటే ఒక అమ్మలక్క అనుకోండి. అమ్మలక్క అంటే మరేం అనుకోద్దూ. తక్కువ పని - ఎక్కువ తీరిక చేసుకుని బద్ధకంగా అందరిళ్ళకీ పెత్తనాలకి బయలు దేరేవాళ్ళన్న మాట. మగాళ్ళయినా ఆడాళ్ళయినా అంతే. కాకపోతే ఈగయ్య అనొచ్చులే!!!!
అనగనగా ఒక ఊళ్ళో ఒక ఈగ(మ్మ ) ఉండేది. అది ఇల్లు అలుక్కుంటూ అలుక్కుంటూ తన పేరు మర్చిపోయింది. వెంటనే "జు(య్" మని ఎగురుకుంటూ ఓ పేదరాసి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి
"పెద్దమ్మా!! పెద్దమ్మా!! నా పేరేంటి"? అంది.
పెద్దమ్మ ఇంటి పనిలోనూ - వంట పనిలోనూ ములిగి పోయి
"ఏమో నమ్మా నాకేం తెలుసు వాకిట్లో కట్టేలు కొట్టే నా కొడుకు నడుగూ" అంది.
అప్పుడు ఈగ ఎగురుకుంటూ వెళ్ళి
"పేదరాసి పెద్దమ్మా-పెద్దమ్మ కొడుకా నా పేరేంటి?" అంది.
అందుకతడు, తలత్తైనా తిప్పకుండా
"నాకేం తెలుసూ? నా చేతిలోని గొడ్డాలినడుగు" అన్నాడు.
ఈగ దిబ్బున గొడ్డలి మీద వ్రాలి
"పేదరాసి పెద్దమ్మా-పెద్దమ్మ కొడుకా - కొడుకు చేతిలోని గొడ్డలా - నా పేరేంటి?" అంది.
ఆ గొడ్డలి కాస్తైనా తన పని ఆపకండా
"నా కేం తెలుసు? నేను కొట్టే చెట్టు నడుగూ" అంది.
అప్పుడు ఈగ సాగదీస్తూ
"పేదరాసి పెద్దమ్మా-పెద్దమ్మ కొడుకా - కొడుకు చేతిలోని గొడ్డలా - గొడ్డలి నరికే చెట్టా- నా పేరేంటి?" అంది.
గలగలా మంటూ చెట్టంది కదా
"నాకేం తెలుసు? నామీద వ్రాలే పిట్టల్ని అడుగూ" అంది.
ఈగ ర(య్ న ఎగిరి చెట్టు మీద పిట్ట - పిట్టనీ అడిగింది.
"పేదరాసి పెద్దమ్మా-పెద్దమ్మ కొడుకా - కొడుకు చేతిలోని గొడ్డలా - గొడ్డలి నరికే చెట్టా - చెట్టు మీద వ్రాలే పిట్టా- నా పేరేంటి?" అంది.
పిట్టలన్నీ కువకువ లాడుతూ "మాకేం తెలుసు? మేం త్రాగే నీళ్ళ నడుగూ" అన్నాయి.
ఈగ ఝామ్మని నీళ్ళ దగ్గర కెళ్ళి సాగదీస్తోంది.
"పేదరాసి పెద్దమ్మా-పెద్దమ్మ కొడుకా - కొడుకు చేతిలోని గొడ్డలా - గొడ్డలి నరికే చెట్టా - చెట్టు మీద వ్రాలే పిట్టా- పిట్టలు త్రాగే నీళ్ళా - నా పేరేంటి?" అని.
నీళ్ళు జలజలా కదిలి "మాకేం తెలుసమ్మా, మాలో ఉన్న చేపల్ని అడుగూ" అన్నయి. ఈగ చేపల్ని చేరి ఏకరువు పెట్టింది.
"పేదరాసి పెద్దమ్మా-పెద్దమ్మ కొడుకా - కొడుకు చేతిలోని గొడ్డలా - గొడ్డలి నరికే చెట్టా - చెట్టు మీద వ్రాలే పిట్టా- పిట్టలు త్రాగే నీళ్ళా - నీళ్ళల్లో ఉండే చేపలా - నా పేరేంటి?" అని.
అవి మిలమిలా మెరుస్తూ వయ్యారంగా చెప్పాయి.
"మాకేం తెలుసూ? తినే తిమ్మరాజునడుగూ" అన్నాయి.
ఈగకేమయినా అలుసా సొలుపా!!! తీరుబడిగా సాగదీస్తూ మొదలెట్టింది. ఏమని?
"పేదరాసి పెద్దమ్మా-పెద్దమ్మ కొడుకా - కొడుకు చేతిలోని గొడ్డలా - గొడ్డలి నరికే చెట్టా - చెట్టు మీద వ్రాలే పిట్టా- పిట్టలు త్రాగే నీళ్ళా - నీళ్ళల్లో ఉండే చేపలా - చేపలు తినే తిమ్మరాజా - నా పేరేంటి?" అంది.
అతను భుగభుగ లాడిపోతూ
"నేను బోలెడు పనిలో కూరుకుని ఉన్నాను. నేనెక్కే గుర్రాన్నడుగు. ఫో!" అని కసిరాడు.
ఈగ ఉస్సూరుమనుకుంటూ జోరుగా ఎగిరి వెళ్ళి
గురాన్నడుగుతోంది.
"పేదరాసి పెద్దమ్మా-పెద్దమ్మ కొడుకా - కొడుకు చేతిలోని గొడ్డలా - గొడ్డలి నరికే చెట్టా - చెట్టు మీద వ్రాలే పిట్టా- పిట్టలు త్రాగే నీళ్ళా - నీళ్ళల్లో ఉండే చేపలా - చేపలు తినే తిమ్మరాజా - తిమ్మరాజెక్కే గుర్రమా - నా పేరేంటి?" అంది.
గుర్రం టక టక లాడుతూ పచ్చ గడ్డి గాబులోంచి తలెత్తకుండానే అంది కదా
"ఈ మాత్రానికి నేనెందుకు, సా కడుపులోని పిల్ల నడుగూ" అంది.
ఈగ కేమయినా విసుగా - కసుగా!!! తిన్నగా వెళ్ళి గుర్రం కడుపులో పిల్ల దగ్గర కూని రాగాలు తీస్తోంది.
"పేదరాసి పెద్దమ్మా-పెద్దమ్మ కొడుకా - కొడుకు చేతిలోని గొడ్డలా - గొడ్డలి నరికే చెట్టా - చెట్టు మీద వ్రాలే పిట్టా- పిట్టలు త్రాగే నీళ్ళా - నీళ్ళల్లో ఉండే చేపలా - చేపలు తినే తిమ్మరాజా - తిమ్మరాజెక్కే గుర్రమా - గుర్రం కడుపులోని పిల్లా - నా పేరేంటి?" అంది.
అందుకా పిల్ల "ఇహి( ఇహి( ఇహి( హి( హి( హీ(ం" అంటూ హేళనగా నవ్వి
"ఓస్!!! ఈ మాత్రానికే ఇంత భాగోతమా - నువ్వు నాతోక మీద వ్రాలబోయే ఈగకాదా!!! అంటూ మళ్ళీ నవ్వటం మొదలెట్టింది.
కథ కంచికీ - మనం ఇంటికీ.................
నీతి: తమ పని ఎంత చిన్నదైనా దాన్ని సాగదీస్తూ ఎదటి వాళ్ళందరి పని సమయాల్లో వెళ్ళి కబుర్లాడే వాళ్లకి ఇలాగే అవుతుంది.
No comments:
Post a Comment