అమ్మ కథలు రెండవది
కొంటె కృష్ణుడు
ఒక ఊళ్ళో ఒక అల్లరి పిల్లవాడుండే వాడు. వాడు పుట్టగానే అల్లరివాడు. అదెల్లాగ? ఎవరన్నా పుట్టగానే అల్లరి చెయ్యగలరా!! అనొచ్చు. నిజమే. పిల్లలు మామూలుగా పుట్టగానే గట్టిగా గుప్పెళ్ళు బిగించి, కళ్ళు మూసుకుని ఉంటారు. వాళ్ళకి వెలుగు చూడటానికి భయం. గుప్పెళ్ళిప్పాలన్నా భయమే. తల్లి కడుపులోనించి బయటి ప్రపంచంలోకి రాగానే ఏదోఐపోయిసట్లు కెవ్వున ఏడుస్తారు. కాని, మన కిష్టయ్య మాత్రం చక్కగా పెద్దపెద్ద గుడ్లు తిప్పుతూ అన్ని వైపులా అందరి మొహాల్లోకి చూస్తునాడు. గుప్పెళ్ళు లేవు!! శుభ్రంగా వేళ్ళు చాపి, కాళ్ళు చాపి హాయిగా సాగదీసుకున్నాడు. వింతవింతగా ఉందని అంతటాపరికిస్తునాడు. ఏడుపూలేదు , గీడుపూ లేదు. అందరూ మురిసి పోయి వాడిని అప్పుడే వీరుడు , ధీరుడని మెచ్చుకున్నారు.
వాడు నవ్వుతూ కేరింతలు కొడుతూ రోజు రోజుకీ అందంగా ఆరోగ్యంగా పెదుగుతున్నాడు. బోర్లా పడటం , పొట్ట మీదమాకటం , మోకాళ్ళమీద పాకటం అన్నీ వెంటవెంటనే వచ్చే సాయి. అందరికీ జుట్టులాగేయ్యటం, ముక్కుపీకేయ్యటం, చెవుల్లో బుడ్డి, బుడ్డి వేళ్ళు గుచ్చెయ్యటం అన్నీ వింతలే వాడికి. వీళ్ళు నొప్పేసి లబో - దిబో అంటే వాడు నవ్వుతాడు. పాక్కుంటూ వెళ్ళి అన్నీ లాగేస్తాడు. ఒలక బోస్తాడు. ముగ్గులు చెరిపేస్తాడు. మంచి మంచి పుస్తకాలు చింపేస్తాడు. అన్నీ నోట్లోకే తోసేస్తాడు. ఒకటా రెండా ఇల్లంతా వాడి అల్లరే. నడక వచ్చాక సరేసరి. అంతా చిందర - వందర. అనీ వాడికి అందకుండా పెట్టేసుకునే వారు. అందితే గోవిందా!!! ఓ దణ్ణం పెట్టాల్సిందే.
ఎల్లాగో భరిస్తున్నారు. స్కూల్లో వేశారు. టీచర్లు, స్కూలు పిల్లలు కూడ భరించటమే. ఆటల్లోనూ పేచీలే. చదువులో మాత్రం భలే చురుకు. ఇలా చెపితే అలా పాఠాలు ఒప్ప జెప్పేస్తాడు. లెక్కలు కూడ అంతే. రాని వాళ్ళ్ని ఎక్కిరించి అల్లరి పెట్టేస్తాడు. టీచర్లని ప్రశ్నలతో విసిగించేస్తాడు. అందంగా ముద్దు ముద్దు గా ఉండటంచేత ఎవ్వరూ ఏమీ అనలేల పోయేవారు.
ఆ రోజుల్లో "Into 5th" అని ఒక ప్రవేశ పరీక్ష (entrance test) ఉండేది. అందులో వీడు ఫస్ట్. ఇంక వాడికి పట్ట పగ్గలు లేకుండా పోయాయి. అప్పుడు ఇంగ్లీషు గ్రామరు 5th లోనే మొదలు. గ్రామరు క్లాసులో తేచరు exclamatory sentence కి example చెప్పమంటే వీడు లేచి "How fool you are!!" అన్నడు. పిల్లలందరూ గొల్లుల నవ్వు. టీచరు ఎరేంచేస్తారు పాపం. లెక్కల టీచరు బోర్డు మీద ఒక లెక్క రాసారు. "ఒక వ్యాపారి రెండు బస్తాల బియ్యం వెయ్యి రూపాయలకు కొని ఆరు కిలోల రాళ్ళు కలిపాడు. బస్తా ఒకటికి 200 రూ చొప్పున అమ్మితే ఎంత లాభం?" అని. ఆన్సర్లు పేపర్లలో రాయాలి. మన వాడు "ఆ వ్యాపారిని వెంటనే జైల్లో వెయ్యాలి" అని రాసాడు.
తెలుగు మేష్టారి మంచి నీళ్ళ మరచెంబులో ఎవరూ చూడకుండా చేప పిల్లల్ని వేసేసాడు. ఆయన పాఠం చెప్పటానికి "సత్య ఙ్ఞాన దయాసింధో................." అని శ్లోకం మొదలుపెట్టగానే కిష్టయ్య లేచి "గోడ దాటితే అదే సందో..........." అంటూ నవ్వుతూ పుస్తకాల సంచి భుజాన్నేసుకుని టైమైపోయింది సార్!!! ఎల్లయ్య ఎఅందుకో ఇంకా బెల్ కొట్టాలేదు అని తన రిస్ట్ వాచ్ చూపించాడు. పిల్లలంతా పొలో మని లేచేసారు. అసలు సంగతేంటంటే ఎల్లయ్య దగ్గరి గంట తనే దాచిపెట్టి, తన వాచ్ లో టైము మార్చేసాడు. వయటి కొచ్చాక అంతా తెలిస్తే మాత్రం ఏ లాభం?
ఇంట్లో అల్లరి సరేసరి. ఫ్రిజ్ లో పాలగిన్నెలో దోసెల పిండి నింపేస్తే పాపం వాళ్ళమ్మ బ్రేక్ ఫాస్ట్ ఎలా చేస్తుంది? కాఫీలెల్లాగ? దొడ్లో పువ్వు;అ చెట్లకి మొగ్గల గుత్తులన్నీ కత్తిరించేస్తే వాళ్ళ బామ్మగారి పూజకి పువ్వులేవి? వాళ్ళ తాతగారి చేతి కర్ర. వాళ్ళమ్మ రొట్టెల పీట - కర్ర ఎప్పుడు పట్టుకు పోయాడో భోగి మంటల్లో వేసేసాడు. మనింట్లో సామాన్లు సరే ఎదురింటి తాతగారి కళ్ళ జోడు పెట్టె, బామ్మగారి పూజ పీట, మడి పట్టు చీర అన్నీను. వాళ్ళు వెతుక్కుని భోగి మంటల్లో గుర్తుపట్టి తగువు లాట కొచ్చారు. పక్కింటి వాళ్ళ తెల్లకుక్కపిల్ల జూలుకి ఆయిల్ పైంట్ తో రంగులు వేసేసాడు. ఆజూలంతా కత్తిరించి పారెయ్యాలి గాని ఎలా? తమ ఇంట్లో సరేసరి. కారమ్సు బోర్డు, కోయిన్స్, గోడలు రంగు రంగుల కార్టూన్ల తోను బొమ్మలతోను నిండి ఉంటాయి. వాళ్ళ తాతగారి, బామ్మగారి బొమ్మలు కూడ చీరలు, జడలు, మీసాలు గౌన్లు వాడిష్టం. వాళ్ళమ్మ తల పట్టుకుని గోల. తెల్లర్తే వీడెవరితో ఏ తంటా తెస్తాడో అని భయమే.
వాళ్ళ నాన్నగారు ఇంజినీరు. ఒకసారి పెద్ద ప్రోజ్ క్ట్ పని మీద వెడుతూ చాలా ముఖ్యమైన కొన్ని పేపర్లు బయట టేబుల్ మీద మర్చిపోయారు. అంతే!! అవి పనికి రావనుకున్నడు కిష్టయ్య. చకచకా పెద్ద పెద్ద రంగుల కార్టూన్లు నిండి పోయాయి. వగర్చుకుంటూ పరుగెత్తి వచ్చిన ఆఫీసు బంట్రోతుని చూసి కిష్టయ్య నిర్ఘాంతపోయాడు.
సంగతి విని వాళ్ళ నాన్నగారు మండిపడి వీడి చెవులు ఎక్కదీస్తున్నరు. అప్పుడే పక్కింటావిడ కుక్కపిల్లని చూపించి వాళ్ళమ్మతో కయ్యానికి దిగింది. వీధివాకిట్లో ఒక గాడిద నేలమీద పడి దొర్లుతూ ఓండ్ర పెడుతోంది. వాళ్ళ తాతగారు మాత్రం తీరువడిగా బోసినవ్వులు కురిపిస్తూ పద్యం చదువుతున్నారు.
"ఆగడ" మని బడి పంతులు
"గాడిద కొడుకటంచు" తండ్రి కోరించగ; హా!!
జగడముల తల్లి యడలగ
""వీడా!! నా కొడుకటంచు" గాడిద ఏడ్చెన్!!
కథ కంచికీ - మనం ఇంటికీ..............
నీతి: పిల్లల అల్లరి - ఆకతాయి తనం భరించటం తప్ప మార్గమేముంటుంది!!!!!
No comments:
Post a Comment