Tuesday, April 19, 2011

అమ్మ కథలు - ఏడవది - కాకర కాయ కథ


అమ్మ కథలు - ఏడవది


కాకర కాయ కథ




అనగనగా ఒక ఊళ్ళో ఒక తల్లీ, కొడుకూ, కోడలు ఉండేవారు.  ఆ కోడలు  చాలా మంచిది.  ఎంతో శ్రద్ధ - సహనం కలిగిన గుణవంతురాలు కూడాను.  అత్తగారు మాత్రం పరమ గయ్యాళి.  గడుసు.  కాస్త అమాయకంగా ఉంటుందని కోడల్ని ఏడిపించుకు తినేసేది.  చేటికీ మాటికీ చాడీలు  చెప్పి కొడుకు చేత తిట్టించేది.  ఉత్తపుణ్యాన తన భార్యని సాధిస్తోందని కనిపెట్టినా ఆ కొడుకు తల్లి దగ్గర మంచి పేరు కొట్టేయ్యాలని ఆమెకు తందనా తాన పాడేవాడు. అడపా - దడపా కొట్టేవాడు కూడాను.  అధి చూసి అత్తగారు లోపల్లోపలే మురిసిపోతూ ఉండేది.


ఓసారి కొడలు వాళ్ళ దొడ్లో కాకరకాయ పాదుపెట్టింది.  దానికి చక్కని పందిరేసి రోజూ నీల్లూ పోస్తూ చూడ ముచ్చటగా పాకించింది.  కాకరపాదు పసుపు పచ్చగా పువ్వులు పూసి ఎంతో అందంగా కలకల్లాడి పోతోంది.  సన్నసన్న పిందెలు కూద చూసి అత్తగారు ఎక్కడ లేని అథారిటీతో దాని మీద  అజమాయిషీ చలాయించటం మొదలుపెట్టింది.  
"నీళ్ళి రోజూ జాగ్రత్తగా పొయ్యి, పేడ....... నీళ్ళల్లో కలిపి దాని కుదుర్లో పొయ్యి.  చీడ ఆకులు తీసేస్తూ ఉండు" 
అంటూ రోజూ కోడలికి పురమాయించటం మొదలయింది.  
తీరా కాయలు కోసి కూర చేసాక 
"నాకు మా అబ్బాయికీ ఎంతో ఇష్టం" అంటూ కొడుక్కి వేసి మిగతాది తనే తినేసేది. కోడలికె రుచికయినా ఒక్కముక్క కూడ ఉంచేది కాదు.  అలా ప్రతి మూడు - నాలుగు రోజులకీ లేత లేత కాకరకాయలు కోసుకుని వేపుడు కూరో, బెల్లం కూరో, అల్లం కూరో, ఉల్లికారం కూరో, పులుసు కూరో, పులుసో లాటి రకరకాల రుచుల్తో చేయించుకుని నోరూరా రాచుకుంటూ కొడుక్కి పెట్టి తనే తినేసింది.
ఒకసారి కొడుకూ-తల్లీ నెల రోజులు వేరే ఊరు వెళ్ల వలసిన పనిబడింది.  సరే వెళ్ళారు.  వాళ్ళు వచ్చే సరికి కాకరకాయలు ముదిరి పోతాయని కోడలు అప్పుడప్పుడు నండు కుంది.  పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకీ కూడ కొన్ని యిచ్చింది.  రెండో-మూడో  కాయలు విత్తనాలకోసం పండనిచ్చింది.  వేసవికాలం మూలంగా పారు కూద కాస్త కాస్త ముదిరి పండిపోయి, ఎండిపోతోంది.  చివరి కాయలన్నీ కోసేసి కోడలు అల్లం, మినప్పప్పు, కొబ్బరి కార్ం కూరి కమ్మ-కమ్మగా కాయల - కాయల పళంగా వేచి ఉంచింది.  అవ్వాళే తల్లీ-కొడుకూ  ఊరు నించి దిగారు.  వేడివేడిగ    కాకర కాయల కూరతో భోం చేసాక అత్తగారికి మళ్ళీ పాదు ఙ్ఞాపకం వచ్చింది.  దొడ్లోకి పరుగెత్తి చూసింది.  కాకర పాదంతా వడిలి పోయి ఎండు - ఎండుగా, పండు - పండుగా కనిపించింది.  ఇంక అత్తగారికి పిచ్చికోపం వచ్చి కోడల్ని నానా మాటలు అనేసి కొడుకొచ్చాక బోలెడు నేరాలు చెప్పేసింది.  నేను లేనప్పుడు కాకర కాయలన్నీ అదే తినేసిందంది. పాదుని ఎండబెట్టేసిందంది.  ఎంత చేసినా ఆమె ఉక్రోషం పట్టాలేక పోయింది.


రాత్రయ్యాక కోడలు బాగా అలిసిపోయి నిగ్రపోతోంది.  మెల్లగా ఆమెని దొర్లిస్తూ చాపలో చుట్టే సింది.  కొడుకుని లేపి ఇద్దరూ ఆ చాప చుట్టని స్మశానానికి మోసుకుపోయారు.  
"ఈ కోడలు ఆగడాలు మితిమీరి పోయాయి.  దీన్ని తగలబెట్టేద్దాం" అంది కొడుకుతో.
కాని అగ్గిపెట్టె తెచ్చుకోటం మర్చిపోయారు.  కొడుకు ఇంటికి పరుగెట్టాడు.  ఇంతలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలితో హోరున వానొచ్చింది.  అత్తగారు చీకట్లో వణుకుతూ తడిసిపోయి ఒక చూరు క్రింద నుంచుంది.  అప్పుడు కోడలికి మెలుకువ వచ్చి మెల్లగా చాప చుట్ట లోంచి బయటికి పాకి వచ్చింది.  చుట్టూ చూసేసరికి భయం వేసింది.  అయితే, తెలివయినది కావటంతో ఒక్క క్షణంలో కథంతా అర్థం అయిపోయింది.  గబగబా ఒక కొయ్య దుంగ తెచ్చి చాపలో చుట్టేసి పెట్టేసింది.  తాను ఒక చెట్టు ఎక్కేసి కొమ్మ మీద కూర్చుంది.  వాన వెలిసింది.  కొడుకు తెచ్చిన అగ్గిపెట్టేతో చాప చుట్టకాల్చేసారు వాళ్ళిద్దరూ!!  ఆ దుంగ చిట-పట లాడుతోంటే అత్తగారంటోంది కదా!!!!
"చూడరా!! అబ్బాయీ!!! దాని కడుపులో కాకరకాయ గింజలు ఎలా పేల్తున్నాయో. ఎన్ని తినేసిందో చూసావా?" అని.
పూర్తిగా  బూడిదయి పోయాక ఇద్దరూ ఇంటికెళ్ళి పడుకున్నారు.  చెట్టు మీద కోడలు ఇదంతా చూస్తూనే ఉంది.  వాళ్ళెళ్ళి పోయాక ఈమెకి కూడ అలసటగా చెట్టు మీదే నిద్రొచ్చేసింది.


ఆ రాత్రి కొందరు గజదొంగలు చెట్టు క్రింద చేతి తాము దొందిలించి తెచ్చిన డబ్బు - నగలు, మంచి మంచి బట్టలు వగైరా అన్నీ పంచుకుంటున్నారు.  పైన కొమ్మ మీంచి జారిపోయి ఆ కోడలు నిద్ర కళ్ళరో వాళ్ళ మధ్యగా "దబ్బు" మని పడింది.  ఆ దొంగలు దెయ్యం అనుకుని హడలిపోయి అన్నీ వదిలేసి ఒకటే పరుగు.  కోడలికి పూర్తిగా మెలుకూవచ్చేసింది.  తెల్లారగట్ట అయిపోయింది. కోళ్ళు కూసేస్తున్నయి.  మసక - మసకగా ఉంది.  పశువుల్ని పొలాలకి తోలుకెడుతున్నారు.రైతులు నాగళ్ళేసుకు పొలాలకి పోతున్నారు.  కోడలు గబ గబా ఈ నగలు - డబ్బు అన్నీ మూట గట్టుకుని చీకట్లో ఎవరూ చూడకుండా ఇల్లు చేరుకుని తలుపు కొట్టింది.  వాళ్ళాయన తలుపు తీసాడు.  కోడలు అతనికి అంతా చెప్పింది.  ఆ డబ్బు = నగలు చూసి అత్తగారు కూడ బాగా సంబరపడిపోయింది.


కానీ, అత్తగారికి దురాశ కూడ పుట్టింది.  వెర్రిదై పోయి తనని కూద అల్లగే చాప చుట్టమని - చెట్టు క్రింద పెట్టి రమ్మని గోలపెట్టింది.  తప్పని సరై కోడలు - కొడుకూ అల్లగే చేసారు.  మళ్ళీ దొంగల గుంపు వచ్చి ధనం పంచుకుంటూంటే అత్తగారు కావాలనే వాళ్ళ మధ్యలోకి దూకింది.  కానీ దెబ్బ గట్టిగా తగిలి "అమ్మో" అని అరిచింది.  అంతే!!! దొంగలికి ఈమె దెయ్యం కాదని తెలిని పోయి చితక బాది కొట్టి - కొట్టి చంపేసారు.


పాపం కొడుకూ - కోడలూ మర్నాడు స్మశాసంలో పడిఉన్న శవానికి యథావిధిగా అంత్యక్రియలు జరపాల్సి వచ్చింది.  అన్నిటితో బాటు మర్చిపోకుండా అగ్గిపెట్టె కూద తీసుకెళ్ళరు.


కథ కంచికి - మనం ఇంటికి...............




నీతి:  అందుకే గయ్యాళితనం - దురాశ కూడ చాలా చెడ్డ గుణాలు కదూ!!!!!!!!!!!





No comments:

Post a Comment