Tuesday, January 25, 2011

పర్షియన్ కథ ఆధారంగా...........కదు ఎ కెల్ కలీ జాన్




ఒక ఊళ్ళో ఓ పేదరాసి పెద్దమ్మ ఉండేది. ఆమె కూతురికి పెళ్ళి చేసి అత్తవారింటికి పంపింది. ఆమె ఊరు ఒక అడివి దాటి వెళ్ళాలి. అయితే ఆ అడవిలో ఎన్నో క్రూర మృగాలు ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్ళాలి.
ఒకసారి పండగకి కూతురినీ, అల్లుడునీ చూడాలని అనిపించి చాలా వంటకాలు తయారు చేసి అడవి గుండా బయలుదేరింది. కాస్తంత దూరం వెళ్ళిందో లేదో ఒక నక్క ఎదురయింది. ఆమెని తినేయాలని చూస్తుంటే పెద్దమ్మకి చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. వెంటనే అంది "నక్క బావా!! నేను ముసలిదాన్ని, నాది ఎముకల గూడు తప్ప ఒంటి మీద కొంచెం కూడ మాంసం లేదు. నువ్వు ఏమి తింటావు? నేను మా అమ్మాయి ఇంటికి వెళ్ళి చక్కగా చిక్ న్, మటన్ లాటి వన్నీ బాగా తిని, బాగా లావుగా తయారయి వస్తాను. అయితే నీకు మంచి మాంసాహారం దొరుకుతుంది" అని అంది. దాంతో నక్క ఆలోచనలో పడి "నిజమే కదా!!" అని " సరే ఫో, తప్పకుండా రావాలి" అని బెదిరించి, మాంఛి మాంసం దొరుకుతుంది కదా, ఎలాగా ఈమె ఇదే దారిలో వెళ్ళాలి, అని వదిలేస్తుంది.
అప్పటికి గండం గడిచింది అని ఊపిరి పీల్చుకుని ఆమె మళ్ళీ నడక ప్రారంభించింది.
అలా నడుస్తూ వెడుతోంది. ఈ లోపు ఎక్కడ నుంచో ఈ పెద్ద పులి మీదికి దూకి అమాంతంగా గట్టీగా గొంతు పట్టేసుకుంది. ఇక చేసేది లేక గింజుకుంటూనే జాగ్రత్తగా, నెమ్మదిగా వేడుకుంటూ ఇందాకా నక్కకు చెప్పినట్లే చెప్పింది కాస్తంత కండ పట్టి వస్తానని.
అది విని ఏమనుకుందో ఏమొ పులి ఆమె మెడ మీది పట్టు వదిలింది. "అయితే నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను వెళ్ళిరా" అని సాగనంపింది.
"హమ్మయ్య, బ్రతుకు జీవుడా" అనుకుంటూ మళ్ళీ నడవటం ప్రారంభించింది, దేవుడిని తలుచుకుంటూ...
ఇలా కొంత దూరం వెళ్ళిందో లేదో మళ్ళీ గండం ఎదురయ్యింది. ఈసారి మృగరాజు సింహం గారు వచ్చేసారు తినేయటానికి. దాంతో నెమ్మదిగా నక్కకు, పులికీ చెప్పిన్నవన్నీ మళ్ళీ సింహానికీ కూడా నచ్చ చెబుతుంది. "మృగరాజా!! ఈ ముసలిదాన్ని వదిలేయ్, మా అమ్మయి ఇంటికి వెళ్ళి, బాగా తిని, లావుగా అయి వస్తాను" అని అంది. చాలా హూందాగా, సింహం ఆమె చెప్పిన వన్నీ వింది, మరి మహారాజు కదా!! చాలా గంభీరంగా ఉంటుంది!! అడనిరాజాయె!!!!
ఠీవిగా "సరే అయితే, వెళ్ళి చక్కగా లావుగా, మాంసం ముద్దలా తయారయి రా" అని సాగనంపింది.
"అమ్మయ్య, ఇప్పటికి బ్రతికిపోయాను" అనుకుంటూ పెద్దమ్మ సంతోషంగా తన కూతురింటికి వెళ్ళిపోయింది. అక్కడ రెండు నెలల పాటు ఉండిపోయింది. కాల ఇట్టే గడిచిపోయింది ఆమెకి, కూతురూ, అల్లుడూ, మనవలూ....... హాయిగా...., కూతురు ఎన్నో మరెన్నో పిండివంటలు, రకరకాల పదార్ఠాలూ వండిపెట్టింది. అల్లుడుగారు అంతో ఆదరంగా చూసుకున్నారామెని. మనవలతో బోలెడు కాలక్షేపం చేసింది. వాళ్ళకి మట్టితో బొమ్మలు చేయటం, కాగితాలతో రకరకాల వస్తువులు చేయటం, రంఉలు వేసి వాటితో ఆడుకోవటం లాటి వన్నీ నేర్పింది.
ఇక తిరుగు ప్రయాణం చేయవలసిన సమయం వచ్చేసింది. అప్పుడు గబుక్కున తను నక్కకీ, పులికీ, సింహానికీ ఇచ్చిన మాట గుర్తు వచ్చింది. నెమ్మదిగా ఆ విషయం వాళ్ళకి చెప్పింది. "ఇప్పుడెలా" అని వాళ్ళంతా కలిసి ఆలోచనలోపడ్డారు. అందరూ కలిసి ఓ ఆలోచన తోచి "ఉపాయం చేద్దాం" అనుకుని....................
ఓ పేద్ద గుమ్మడి కాయ కొనుక్కొచ్చారు పెరట్లోంచి. అన్నట్లు పిల్లలూ!!! మీకిక్కడ నేనో విశేషం చెప్పాలి. మనకు మల్లే గుమ్మడి కాయలు చిన్నవిగా, గుండ్రంగా ఉండవు. పర్షియా దేశంలో కింద బేస్ గుండ్రంగా, పెద్దదిగా ఉండి, పైకెడుతున్నకొద్దీ సన్నబడి పొడవుగా, ఓ పది-పదిహేను కిలోల బరువులో ఉంటాయి. ఒక్క గుమ్మడి కాయలే ఏమిటి ఆనప కాయలూ, వంకాయలూ, కాబేజీలూ, కాలీఫ్లవర్ లూ కూడా చాలా పెద్దగా ఉంటాయి. కాబేజీలూ, కాలీఫ్లవర్లు కూడా పది-పన్నెండు కిలోల బరువు ఉంటాయి.
వాళ్ళంతా కలిసి ఆ గుమ్మడి కాయ పై భాగం ఓ మూతమాదిరి "కట్" చేసి, లోపలి గుజ్జంతా తీసేసి, డొల్ల చేసారు. అందరూ ఆమెకి వీడ్కోలు చెప్పి, నెమ్మదిగా ఆమెని అందులో కూర్చోబెట్టి మూత పెట్టారు. అడుగున గుండ్రంగా ఉందిగా, ఒక్కుదుటున, తిప్పుతూ, దాన్ని బొంగరం తిప్పినట్లు తిప్పారు. అంతే!!! ఆ ఊపుకి అదలా నెమ్మదిగా దొర్లుతూ వెళ్ళటం మొదలెట్టింది. దార్లో సింహం చూసి...........
"ఇదేంటి ఈ గుమ్మడి కాయ ఇలా దొర్లుతోంది" అని వింతగా చూస్తూ ఉండిపోయింది.
పులి అయితే మాత్రం చెట్టెక్కేసింది భయంతో. అదేదో మంత్రించిన, దెయ్యం ఉన్న గుమ్మడికాయ అనుకున్నాయో ఏమో మరి!!!!
కాస్త ఖ్హంగారేసింది దానికి మరెప్పుడూ ఇలా దొర్లుతూ ఉన్న గుమ్మడి కాయ అవెప్పుడూ చూడలేదుగా!!!
అలా వెళ్ళి పోతున్న గుమ్మడి కాయని నక్క చూసింది. అది నదర లేదు, బెదర లేదు. సరికదా!! "జిత్తుల మారేమొ"!!! దానికి అనుమానం వేసేసింది. గబుక్కున దానికి అర్ధం అయిపోయింది. "ఇది బహుశా పేదరాసి పెద్దమ్మ పనే అయుంటుంది. లోన ఉండి ఉంటుంది" అనుకుంది. ఒక్కసారిగా దాని బుర్రతో గుమ్మడి కాయ పొట్టలోకి దూసుకుపోయింది, పెద్దమ్మ ని తినేద్దామన్న కోపంలో. అయితే పెద్దమ్మ ఒక్కుదుటున మూతతీసేసి బయటకి దూకేసింది. నక్క బుర్ర మాత్రం గుమ్మడి కాయ డొల్లలో ఇరుక్కు పోయింది. పెద్దమ్మ హాయిగా, నవ్వుతూ గబ గబా తన ఇంటి వయిపు పారిపోయింది.


చూసారా పిల్లలూ!! పెద్దమ్మ తనిచ్చిన మాట నిలబెట్టు కుంది, మరి ఉపాయంతో తన ప్రాణాలు కూడా కాపాడుకుంది. ఇదర్రా నిజాయితీ, ధైర్యం, సాహసం అంటేనూ......................




....................................................................... మీ స్వర్ణత్త

No comments:

Post a Comment