చల్లని సాయంత్రం వేళ ఒక చక్కని కార్యక్రమం. ఒక క్రొత్త ఒరవడి.
మంచి, నూతన విషయ సేకరణ, పిల్లలందరికీ క్రొత్త విషయాలు తెలుసుకునే అవకాశం. నాట్యం నేర్చుకోవటమే కాదు, దాని గురించి తెలుసుకోవటం, అర్ఠం చేసుకోవటం, జీర్ణించుకుని అప్పుడు దానికి తగినట్లుగా ప్రదర్శించటం అలవరచ్చుకోటానికి ఒక చక్కని వేదిక.
కాలేజేలకీ, విద్యాలయాలకీ మాత్రమే పరిమితమైన ఈలాటి బోధనా విధానం ఇలా ప్రదర్శిత మవటం ముదావహం.
కళాకారిణులంతా ముందుగానే సమావేశమై ఒకరు చెప్పినది తిరిగి వేరొకరు చెప్పకుండా ఉండేలా, ప్రయత్న పూర్వకంగా ఉపన్యసించారు.
ఈ సదస్సులో ముఖ్యం గా రెండు విషయాలు ద్యోతకమైనాయి. మొదటగా "అభినయ భావంకురము" అన్నది నాట్యంలో "శబ్దం" అనే అంశం తోనే మొదలవుతుందని వివరణ నిచ్హారు.
మొదటి భావ ప్రకటన, అభినయ ప్రదర్శన చిన్నగా అంకురించటం అన్నది స్పష్టం గా వివరించారు. ఇది ఒక రైతు నకు తొలకరి జల్లులలో కనబడే మొదటి మొలకల్లాగా సంతోషాన్ని కలిగిస్తుందని భావించారు. నాట్యారంభంలో ఒక జత అడవులు, ఓ జత జతులు, బాగా నేర్చుకున్నాక , కౌత్వం, జతిస్వరం, నృత్తప్రధానంగా నేర్పి,
ఆ తరవాత మొదటగా, "భావం" ఉత్పన్నమవటానికి ఆరంభంగా "శబ్దం" అన్న అంశం నేర్పటం జరుగుతుందని కళాకారిణులు అందరూ తమ తమ శిష్యులను ఉద్దెశించి మాట్లాడటం జరిగింది.
ఈ మధ్య కాలంలో తొండర పడి, శిష్యుల ధారణాశక్తి ఎక్కువగా ఉందని, త్వర త్వర గా నేర్పేసి ఆరంగేట్రాలు చేయించేస్తున్నారనీ, అది తగదనీ, క్షుణ్ణంగా వచాకనే నేర్పాలనీ అభిప్రాయపడ్డారు. పిల్లలకు "శబ్ద-సాహిత్యం" లోని భావం అర్థం అయ్యాకనే దాని యొక్క ప్రదర్శన అభినయ ప్రధానమై రసోత్పత్తి కలుగుతుందనీ, అంతదాకా ఆగి నేర్పాలనీ వివరించారు.
రెండవ విషయం - "దేవదాసి" అనే పదం వాడకుండా "దేవనర్తకి" అని వాడాలనీ, దానికి ఉన్న మచ్చ తొలగిపోయేలా ఉండాలనీ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ముఖ్య అతిథిది శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారు కూడ సమర్థిస్తూ ఇప్పటి నుండీ అందరూ ఈ విధంగానే సంబోధించాలని సూచించారు.
"రాజదాసి" అనే వారు ఒక రాజుకి ప్రత్యేకించి ఉండేవారనీ, "దేవనర్తకి అన్నది ఒక "పదవి" మాదిరి అనీ నర్తకీమణులు వివరించారు. ఉత్సవ సమయాల్లో దేవాలయ సాంప్రదాయాల్లో రాజుగారి, ముందర ప్రదర్శించే వారనీ వివరించారు. వారికి పట్టిన "దృష్టి" తీసేయటానికి "హెచ్చరిక" అనే అంశం చేస్తారనీ చెప్పారు.
శబ్దం అంటే "ధ్వని",
"యశోగీతి". ఇది లయ, నడక, లేదా తాళం ఎక్కువగా మిశ్రచాపు లో ఉంటుందనీ (తక్కిట, తక్కధిమి) మరియు కాభోజి రాగంలో కూర్చటం జరిగిందని చెప్పారు. రాజాస్థానాల్లో రాజుని పొగడటానికి, కీర్తించటానికీ, అతని కర్తవ్యం మర్చి పోకుండా గుర్తుచేయటానికి, బోధించటానికీ, ఉపయోగపడేదని అభిప్రాయపడ్డారు.
"దేవనర్తకి" తమ కర్తవ్యం నెరవేర్చేవారనీ, అది ఒక నాట్యం కింద కన్నా నాట్యభంగిమల్లో దానిని వివరించేవారనీ అభిప్రాయపడ్డారు.
సాహిత్యం కూడా పదాభినయంలో మిశ్రచాపు గతిలో తాళానికి అనుగుణంగా ఉంటుందని ఉదహరించారు. ఉదా: "సరసి జాక్షులు, జలక మాడే". అన్ని శబ్దాలూ "తతైయ్యా తై తత్తతాం" తోనే మొదలవుతాయి అన్నారు. ఊరేగింపు తరవాత దేవునికి కొద్దిగా విరామ సమయం ఉండేదని, సాయంత్రాల్లో సంగీత-నృత్య ప్రదర్శనలు నిర్వహించేవారనీ, కామ-వికారాలు కలుగకుండా, సున్నితంగా ఉండే
"శబ్దం" ప్రదర్శితమయ్యేదనీ, ఆ క్రమంలో ఎక్కువగా నృత్త ప్రధానంగా ఉండే అంశాలను ప్రదర్శించేవారనీ వివరించారు.
కళాకారిణులంతా పిల్లలకు సాహిత్యాన్ని క్లుప్తంగానే కథ నడిచేలా నేర్పాలనీ, ఎక్కువగా కథని పొడిగించి, ఒకే వాక్యాన్ని పదే పదే నర్తించటం తగ్గించాలనీ, అలా చేయటం అనువజ్ఞు లయిన సీనియర్ కళాకారులకు, సంచారీ భావ ప్రకటన వచ్చాకనే చేయాలనీ అభిప్రాయం వ్యక్తీకరించారు. ఉదా: దశావతార శబ్దంలోనే "మత్సరమున మరియంబుధిలో.
అతిథులు సాహిత్యంలోని ప్రాంతీయ పోకడల దృష్ట్యా చిన్న చిన్న పదాలయందు కలిగే మార్పులను కళాకారులు ఆయా మార్పులను గ్రహించి తగినట్లుగా, సమయోచితంగా మార్చుకోవచ్చుననీ, పెద్దగా పట్టించుకోనవసరం లేదనీ అభిప్రాయబడ్డారు.
కాశీనాథుని శబ్దం, కందుకూరి రుద్ర కవి, తంజావూరు రాజులు, నాయక రాజులు, చిన్నయ్య-పొన్నయ్య-వడివేలు-సదానందం శబ్దాలు, భోన్స్లే రచనలు, మధుర నాయక రాజులు, తులజాజి శబ్దాలు, కార్వేటి నగర వైభవం, గద్వాల్ నగరం, బొబ్బిలి నగరం, పిఠాపురం, మొ!! సంస్థానాలలో, ప్రతాప సిం హేంద్ర రాజుని ఉద్దేశించి వ్రాసిన రచనల్లోనూ కూడా ఎన్నో శబ్దాలు రచింపబడ్డాయి.
అన్నమాచర్య కీర్తనల్లోనూ, శబ్దం నడక కనిపిస్తుంది, ఉదా: "చక్కని తల్లికి చాంగు భళ". మరియు, "శరణు శరణు సురేంద్ర సన్నుత" లోనూ, "జయ జయ రమానాథ" తరంగం లోనూ కూడా శబ్దం పోకడలు కనిపిస్తాయి అని అనుకున్నారంతా.
సంగీతంలో ఎక్కువగా వాడే "నెరవళ్ళు",
సాధారణంగా నాట్యంలో వయొలిన్ కి వదిలేస్తూ ఉంటారనీ, అలా కాకుండా వాటిని పాడుతూ, నర్తించటం వల్ల ఆ నాట్యానికి చాలా అందంవస్తుందనీ అభిప్రాయపడ్డారు.
No comments:
Post a Comment