Showing posts with label telugu. Show all posts
Showing posts with label telugu. Show all posts

Tuesday, January 25, 2011

పర్షియన్ కథ ఆధారంగా...........కదు ఎ కెల్ కలీ జాన్




ఒక ఊళ్ళో ఓ పేదరాసి పెద్దమ్మ ఉండేది. ఆమె కూతురికి పెళ్ళి చేసి అత్తవారింటికి పంపింది. ఆమె ఊరు ఒక అడివి దాటి వెళ్ళాలి. అయితే ఆ అడవిలో ఎన్నో క్రూర మృగాలు ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్ళాలి.
ఒకసారి పండగకి కూతురినీ, అల్లుడునీ చూడాలని అనిపించి చాలా వంటకాలు తయారు చేసి అడవి గుండా బయలుదేరింది. కాస్తంత దూరం వెళ్ళిందో లేదో ఒక నక్క ఎదురయింది. ఆమెని తినేయాలని చూస్తుంటే పెద్దమ్మకి చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. వెంటనే అంది "నక్క బావా!! నేను ముసలిదాన్ని, నాది ఎముకల గూడు తప్ప ఒంటి మీద కొంచెం కూడ మాంసం లేదు. నువ్వు ఏమి తింటావు? నేను మా అమ్మాయి ఇంటికి వెళ్ళి చక్కగా చిక్ న్, మటన్ లాటి వన్నీ బాగా తిని, బాగా లావుగా తయారయి వస్తాను. అయితే నీకు మంచి మాంసాహారం దొరుకుతుంది" అని అంది. దాంతో నక్క ఆలోచనలో పడి "నిజమే కదా!!" అని " సరే ఫో, తప్పకుండా రావాలి" అని బెదిరించి, మాంఛి మాంసం దొరుకుతుంది కదా, ఎలాగా ఈమె ఇదే దారిలో వెళ్ళాలి, అని వదిలేస్తుంది.
అప్పటికి గండం గడిచింది అని ఊపిరి పీల్చుకుని ఆమె మళ్ళీ నడక ప్రారంభించింది.
అలా నడుస్తూ వెడుతోంది. ఈ లోపు ఎక్కడ నుంచో ఈ పెద్ద పులి మీదికి దూకి అమాంతంగా గట్టీగా గొంతు పట్టేసుకుంది. ఇక చేసేది లేక గింజుకుంటూనే జాగ్రత్తగా, నెమ్మదిగా వేడుకుంటూ ఇందాకా నక్కకు చెప్పినట్లే చెప్పింది కాస్తంత కండ పట్టి వస్తానని.
అది విని ఏమనుకుందో ఏమొ పులి ఆమె మెడ మీది పట్టు వదిలింది. "అయితే నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను వెళ్ళిరా" అని సాగనంపింది.
"హమ్మయ్య, బ్రతుకు జీవుడా" అనుకుంటూ మళ్ళీ నడవటం ప్రారంభించింది, దేవుడిని తలుచుకుంటూ...
ఇలా కొంత దూరం వెళ్ళిందో లేదో మళ్ళీ గండం ఎదురయ్యింది. ఈసారి మృగరాజు సింహం గారు వచ్చేసారు తినేయటానికి. దాంతో నెమ్మదిగా నక్కకు, పులికీ చెప్పిన్నవన్నీ మళ్ళీ సింహానికీ కూడా నచ్చ చెబుతుంది. "మృగరాజా!! ఈ ముసలిదాన్ని వదిలేయ్, మా అమ్మయి ఇంటికి వెళ్ళి, బాగా తిని, లావుగా అయి వస్తాను" అని అంది. చాలా హూందాగా, సింహం ఆమె చెప్పిన వన్నీ వింది, మరి మహారాజు కదా!! చాలా గంభీరంగా ఉంటుంది!! అడనిరాజాయె!!!!
ఠీవిగా "సరే అయితే, వెళ్ళి చక్కగా లావుగా, మాంసం ముద్దలా తయారయి రా" అని సాగనంపింది.
"అమ్మయ్య, ఇప్పటికి బ్రతికిపోయాను" అనుకుంటూ పెద్దమ్మ సంతోషంగా తన కూతురింటికి వెళ్ళిపోయింది. అక్కడ రెండు నెలల పాటు ఉండిపోయింది. కాల ఇట్టే గడిచిపోయింది ఆమెకి, కూతురూ, అల్లుడూ, మనవలూ....... హాయిగా...., కూతురు ఎన్నో మరెన్నో పిండివంటలు, రకరకాల పదార్ఠాలూ వండిపెట్టింది. అల్లుడుగారు అంతో ఆదరంగా చూసుకున్నారామెని. మనవలతో బోలెడు కాలక్షేపం చేసింది. వాళ్ళకి మట్టితో బొమ్మలు చేయటం, కాగితాలతో రకరకాల వస్తువులు చేయటం, రంఉలు వేసి వాటితో ఆడుకోవటం లాటి వన్నీ నేర్పింది.
ఇక తిరుగు ప్రయాణం చేయవలసిన సమయం వచ్చేసింది. అప్పుడు గబుక్కున తను నక్కకీ, పులికీ, సింహానికీ ఇచ్చిన మాట గుర్తు వచ్చింది. నెమ్మదిగా ఆ విషయం వాళ్ళకి చెప్పింది. "ఇప్పుడెలా" అని వాళ్ళంతా కలిసి ఆలోచనలోపడ్డారు. అందరూ కలిసి ఓ ఆలోచన తోచి "ఉపాయం చేద్దాం" అనుకుని....................
ఓ పేద్ద గుమ్మడి కాయ కొనుక్కొచ్చారు పెరట్లోంచి. అన్నట్లు పిల్లలూ!!! మీకిక్కడ నేనో విశేషం చెప్పాలి. మనకు మల్లే గుమ్మడి కాయలు చిన్నవిగా, గుండ్రంగా ఉండవు. పర్షియా దేశంలో కింద బేస్ గుండ్రంగా, పెద్దదిగా ఉండి, పైకెడుతున్నకొద్దీ సన్నబడి పొడవుగా, ఓ పది-పదిహేను కిలోల బరువులో ఉంటాయి. ఒక్క గుమ్మడి కాయలే ఏమిటి ఆనప కాయలూ, వంకాయలూ, కాబేజీలూ, కాలీఫ్లవర్ లూ కూడా చాలా పెద్దగా ఉంటాయి. కాబేజీలూ, కాలీఫ్లవర్లు కూడా పది-పన్నెండు కిలోల బరువు ఉంటాయి.
వాళ్ళంతా కలిసి ఆ గుమ్మడి కాయ పై భాగం ఓ మూతమాదిరి "కట్" చేసి, లోపలి గుజ్జంతా తీసేసి, డొల్ల చేసారు. అందరూ ఆమెకి వీడ్కోలు చెప్పి, నెమ్మదిగా ఆమెని అందులో కూర్చోబెట్టి మూత పెట్టారు. అడుగున గుండ్రంగా ఉందిగా, ఒక్కుదుటున, తిప్పుతూ, దాన్ని బొంగరం తిప్పినట్లు తిప్పారు. అంతే!!! ఆ ఊపుకి అదలా నెమ్మదిగా దొర్లుతూ వెళ్ళటం మొదలెట్టింది. దార్లో సింహం చూసి...........
"ఇదేంటి ఈ గుమ్మడి కాయ ఇలా దొర్లుతోంది" అని వింతగా చూస్తూ ఉండిపోయింది.
పులి అయితే మాత్రం చెట్టెక్కేసింది భయంతో. అదేదో మంత్రించిన, దెయ్యం ఉన్న గుమ్మడికాయ అనుకున్నాయో ఏమో మరి!!!!
కాస్త ఖ్హంగారేసింది దానికి మరెప్పుడూ ఇలా దొర్లుతూ ఉన్న గుమ్మడి కాయ అవెప్పుడూ చూడలేదుగా!!!
అలా వెళ్ళి పోతున్న గుమ్మడి కాయని నక్క చూసింది. అది నదర లేదు, బెదర లేదు. సరికదా!! "జిత్తుల మారేమొ"!!! దానికి అనుమానం వేసేసింది. గబుక్కున దానికి అర్ధం అయిపోయింది. "ఇది బహుశా పేదరాసి పెద్దమ్మ పనే అయుంటుంది. లోన ఉండి ఉంటుంది" అనుకుంది. ఒక్కసారిగా దాని బుర్రతో గుమ్మడి కాయ పొట్టలోకి దూసుకుపోయింది, పెద్దమ్మ ని తినేద్దామన్న కోపంలో. అయితే పెద్దమ్మ ఒక్కుదుటున మూతతీసేసి బయటకి దూకేసింది. నక్క బుర్ర మాత్రం గుమ్మడి కాయ డొల్లలో ఇరుక్కు పోయింది. పెద్దమ్మ హాయిగా, నవ్వుతూ గబ గబా తన ఇంటి వయిపు పారిపోయింది.


చూసారా పిల్లలూ!! పెద్దమ్మ తనిచ్చిన మాట నిలబెట్టు కుంది, మరి ఉపాయంతో తన ప్రాణాలు కూడా కాపాడుకుంది. ఇదర్రా నిజాయితీ, ధైర్యం, సాహసం అంటేనూ......................




....................................................................... మీ స్వర్ణత్త

Monday, January 24, 2011

నవీనాంధ్రప్రదేశ్ లో తెలుగు-పిల్లలు-తల్లిదండ్రులు


పిల్లలూ!! వారి తల్లిదండ్రులూ!! మన మందరం ఒక విషయం గమనించాలి!!
మనిషి పుట్టి మనుగడ మొదలయ్యాక బట్టకట్టాలని తలపుకివచ్చి ఆకులు కట్టుకునేవాడని అందరూ వినే ఉంటారు.
మరి భాష కూడ అలాగే అతనిలోని ఆలోచనలను చెప్పటానికి తయారు చేసుకున్నాడు. ప్రాంతా  లవారీగా దానికి ఒక రూపం ఇచ్చాడు.  రకరకాల ధ్వనులతో కాలక్రమేణా దానికి ఒక స్ట్రక్చర్ ఏర్పడింది.  
తెలుగు భాష మాతృభాషగా కల వారు ఎంతో అదృష్టవంతులని తెలుసుకోవాలి.  ఎందుకంటే భారత దేశంలోని దక్షిణాది భాషలన్నింటి లోనూ తెలుగుభాష అతి మృదుమధురంగా ఉంటుందని ఈ భాషను "ఇటాలియన్ ఆఫ్ ద ఈష్ట్" గా గుర్తించారు. 
మిగిలిన అన్ని భాషలలాగా తెలుగు భాష ప్రచారంలోకి ఎక్కువగా రాలేదు.  కారణం తెలుగు వాళ్ళు చాలా సిగ్గుపడతారు.  త్వరగా ముందుకు దూసుకుపోరు, భాషవాడకంలో మిగిలినవారిలాగా!! ఇది, ముఖ్యంగా "మొహమాటం" ముందు పుట్టి తరవాత "వాళ్ళు పుడతారు" కాబట్టి.  అందరూ కూడా ఎక్కువగా ఎదుటివారి భాష నేర్చుకుని, వారిలాగా, వారిలో ఒకరుగా కలిసిపోతారు కాబట్టి.  దాంతో, తెలుగు భాష వారితోనే ఉండిపోతుంది.  ఇది ఒక రకంగా వారి యొక్క పరభాషా సహనానికి, అభిమానానికి, దానిని భరించ గలిగే ఓపికకీ మంచి నిదర్శనం. 
మాతృ భాష అన్నది ఎంతో తీయనయినది, తీయదనం నింపేది.  సుఖంలోనూ, దుఖంలోనూ గుర్తువచ్చేది, మనిషి పలికేది మాతృభాషే....... కాబట్టి, ప్రతీ తెలుగు ప్రజా, ఈ గడ్దమీద పుట్టి నందుకు తెలుగు భాషను నేర్చుకుని తీరాల్సిందే.......... దీనికి ఒక ఉదాహరణ చెబుతాను......
జపాన్ దేశంలోని వారు పది సంవత్సరాల వయస్సు వచ్చేవరకూ కూడ మాతృభాష మాత్రమే నేర్పుతారు.  ఆ తరవాతే వేరే సబ్ జెక్ట్స్ మొదలు పెడతారు.  అధునాతన శాస్త్రీయ విజ్ఞానం కూడ వారి భాషలోనికి అనువదించబడుతోంది.  అదీ విడుదల అయిన కొన్ని గంటల లోపునే.  పి హెచ్ డీ, రిసర్చ్ లెవల్ లో కూడ వాళ్ళ భాషలోనే పని జరుగుతుంది.  వాళ్ళ కంప్యూటర్ లు సయితం జపనీస్ లోనే మాట్లాడతాయి.
ఏ మాతృభాష అయినా సరే ఒక్క ఇంగ్లీష్ (కొంత ఫ్రెంచ్) తప్ప అచ్చులు-హల్లులు చాలా ఎక్కువ. అందుకే  అవి క్లిష్టతరం నేర్చుకోవటానికి.  వాక్యాలు పూర్తి చేయటానికి ఎక్కువ పదాలు వాడవలసి వస్తుంది.    అదే ఇంగ్లీషు అయితే "చెప్పదలుచు కున్నదాన్ని చాలా తక్కువ అక్షరాల్లో పూర్తి చేయవచ్చును" అనే ఒక అభిప్రాయం అందరిలో ధృవపడి పోయింది.  అధునాతన విద్యావిధానంలో "అన్నింటినీ అనువదించటం కన్నా ఇంగ్లీషు నేర్చేసుకుంటే పోలే"  అన్న భావం ఒకటి నాటుకు పోయింది.
ఈ ౨౧ వ శతాబ్దంలో కృత్రిమత ఎక్కువై పోయి, "యంయన్ సీ" ల పోకడలు, వాటి ప్రభావం అంతా ఇంతా కాదు, హిమవత్పర్వత శ్రేణంతగా పెరిగిపోయి అంతా అమెరికా ప్రభావమే అయిపోయి పుట్టిన పాపాయితో సహా "అమ్మా-నాన్న" అంటే నామొషీ గా అనిపించే తల్లి-దండ్రులతో నిండిపోయింది.  
అసలు నిజం చూస్తే ఈనాటి తల్లి-దండ్రులకు పిల్లల్ని సాకేంత టైమ్ దొరకటం లేదు.  భాషా-ధ్యాసా లేని ఆయమ్మల ఒడిలో పెరిగే చంటి పాపలు "మమ్మీ-డాడీ" లని డబ్బు సంపాదించే యంత్రాలుగా, తమకు కావలసినది అందించే "రోబోట్ లలా" చూస్తున్నారు తప్ప................... 
జీవితాలకి కావలసిన విలువలను, మన సంస్కృతి, సాంప్రదాయాలను వంట పట్టించే ప్రేమ మూర్తులుగా చూసేదెప్పుడో!!!
ఈ మద్య కాలంలో పిల్లలు "మా అమ్మ కీ, నాన్నకీ పట్టిన పిచ్చి కానీ, నాకు చదువు వస్తుందా" అనుకుంటున్నారు.  ముఖ్యంగా ౮వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలు.  గోడలు దూకేస్తున్నారు కొందరు.  మరి కొందరు ఎక్స్టా క్లాసెసె అనీ, ట్యూషన్ అనీ, ఆబాకస్ క్లాస్ అనీ, ఫాషన్ డిసైనింగ్, డ్రాయింగ్ అంటూ రకరకాల క్లాసులకి పంపేస్తూంటే విసుగెత్తిపోతున్నారు.  తల్లిదండ్రులు డబ్బు ఖర్చు చేసేస్తే పిల్లలు బాగా అయిపోతారని అనేసుకుంటున్నారు.  మన సంసృతి, సాంప్రదాయాలు తెలియచేసే శాస్తీయ కళలు నేర్చుకుంటే సుఖం, శాంతి నిచ్చి హాయిని కలుగ చేస్తాయని తెలుసుకునేదెప్పుడో!!!
"ఇంగ్లీషు" చదువులతో రాజ్యాలేలేయవచ్చనే భావన ముందు............తెలుగులో చదువుకుంటే కనీసం మన ప్రక్క ప్రాంతంలో కూడా ఉద్యోగవకాశం లేదాయె!!! అన్ని రాష్టాల్లోనూ వాళ్ళ మాతృభాష వారికి ఉద్యోగాలు కేటాయించబడ్డాయి.  కానీ మన రాష్టంలో మాత్రం ఎంతో ఉదాత్తమైన రీతిలో అందరికీ ఉద్యోగాలు ఇస్తుంది, కానీ తెలుగు వారికి మాత్రం ఈయదు.  మన రాష్త్ర ప్రభుత్వం యొక్క కార్యాలయాల్లో తెలుగువారి సంఖ్య కొంత మెరుగ్గా ఉన్నా కేంద్రీయ కార్యాలయాలు మన రాష్ట్రంలోనే ఉన్నా అందులో రాష్ట్రేతరులే ఎక్కువ.
ఇకపోతే "తెలుగు" భాష తీసుకున్న స్కూలు పిల్లలకి తక్కువ మార్కులు రావటం మరో విశేషం.  ఇది కాదని "సంస్కృతము", "హిందీ" ఎక్కువ మార్కుల కోసం తీసుకోవటం జరుగుతోంది.  పోనీ అదేనా నేర్చుకుంటారా అంటే అదీ లేదు.  పరీక్ష కోసం ముక్కున పెట్టుకుని, ఆ తరవాత మర్చిపోతున్నారు.  దానితో ఏ భాషా సరిగ్గా రాకుండా అయిపోతున్నారు.
తెలుగులో ఎంతో సాహిత్యం-పద్యాలు, కథలు, కవిత్వం, వ్యాసాలు, వచనాలూ, కావ్యాలూ, గ్రంథాలూ, హాస్యం ఉన్నాయి.  ఓ పాతికేళ్ళ క్రితం వరకూ కూడ "తెలుగు" కనీసం పదో క్లాసు వరకూ చదువు కోవటం, జరిగింది.  వ్యాకరణంలో "సంధులు", "సమాసాలు", ఉత్పలమాల-చంపకమాల లాటి "ఛందస్సు", ఉన్నాయి, నేర్చుకుంటే ఎంతో బాగుంటాయి.  ఓ పజిల్ చేసినట్లు, ఓ ఛాల్ంజ్ లా ఉండే లెఖ్ఖ చేసినట్లుగా!!! అంతెందుకు, ప్రఖ్యాత రచయిత్రి ముప్పాళ్ళ రంగనాయకమ్మగారు వాళ్ళాయన మీద కోపం వచ్చినప్పుడల్లా "మీ మీద ఓ కథ రాసేస్తాను" అనేవారుట.
భాష అన్నది అభివృద్ధికోసం, మన మనస్సులోని అనేకానేక ఆలోచనలకు రూపం దిద్దటం కోసం, ఉచితానుచితాలు తెలుసుకుని, జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించటం కోసం, మనలో ఎటువంటి మహానుభావులు ఉన్నారో, ఏమేమి చేసారో, ఎలా చేసారో తెలుసుకోవటం కోసం. మన ఆలోచనలను ప్రభావితం చేసి మనని ఎంతో ఎత్తుకి ఎదిగేలా చేసేదే మన మాతృభాష.  అందుకే అందరూ "చిన్నతనం" అనుకోకుండా ఎంతో "గర్వంగా" మన భాష నేర్చుకోవాలి, అందులోనే వ్యవహరించాలి.