Monday, June 6, 2016

శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు --- బాలానందం



ఆంధ్ర ప్రదేశ్ ఉపసభాపతి గౌ!! శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు అరవై వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో, బుద్ధ ప్రసాద్ గారు తిరిగి బాల్యంలోకి మళ్ళీ అడుగిడుతున్నారు.  మరి ఇపుడు తలుచు కోవాల్సినది, ఆయన జీవితంలోని మధురంగా, స్ఫూర్తిదాయకంగా గడిచిన బాల్యం లోని తలపులే కదా!!

మానసిక శాస్త్రం, పిల్లలకి తరగతిలోని పాఠ్యాంశాలు మాతృభాషలో చక్కగా, తేలికగా అర్థం అవుతాయి అంటుంది.  అలా శిక్షణ పొందిన వారు చదువులోనూ, తెలివితేటల్లోనూ, రాణిస్తారని తెలుసుకున్న ఆయన, తెలుగులో ఎన్నో రచనలు చేస్తూ భాషాసాంస్కృతులకు ఎనలేని సేవ చేయటం జగమెరిగిన సత్యమే!!

బుద్ధ ప్రసాద్ గారు రాజకీయవేత్తగా, సాహితీవేత్తగా సరిసమానంగా తూగుతున్నా - 
రాజకీయ వేత్తగా ఉంటూ రచనా వ్యాసంగం చేయటం, నిష్కళంకంగా జిల్లాభి వృద్ధి, ప్రావాసాంధ్రుల భాషాసేవ, అపర గాంధేయ వాదిగా వన్నె కెక్కటం లాంటివన్నింటినీ ఒకే  దీక్షతో చేయటం మాటలా!! పాలనా పరంగానూ, విద్యాపరంగానూ కూడ చైతన్యం ప్రేరేపించే విధంగా జవసత్వాలు పుంజుకునేలా చేస్తూ, దృఢ నిర్ణయాలను సానుకూలంగా, విజయవంతంగా తీర్చిదిద్దటం ఒక కళా నైపుణ్యం.

ఇదంతా రావాలంటే మరి అలనాటి బాలానందం అన్నయ్యగారు, శ్రీ న్యాయపతి రాఘవరావు, అక్కయ్య గారు శ్రీమతి న్యాయపతి కామేశ్వరి గార్లు బుద్ధ ప్రసాద్ గారిని గుర్తించి, అందించిన చిన్ననాటి సదవకాశాలే కదా అనటంలో అతిశయోక్తి లేదేమో!! ఆయన మాటల్లోనే చాలా సార్లు ఇలా చెప్పటం విన్నాము కూడా!! బాలల సమగ్ర పత్రిక  "బాల" మాసపత్రిక సంపాదక వర్గంలో స్థానం కల్పించడమే కాకుండా, దాశరథి గారి బాల్య విశేషాలతో కూడిన "ఇష్టాగోష్టి"చేయటంతో ఆయన ప్రతిభకు గుర్తింపు లభించిందనే చెప్పాలి.  మరి ఆ ఛాయలేగా, ఈనాడు మనందరం ఆస్వాదిస్తున్నది!!

అలనాటి (    ) నాటి మాట, శ్రీ జలగం వెంగళ రావు గారి మంత్రి వర్గం లో విద్యా, సాంస్కృతిక శాఖామాత్యులు గా ఉన్న మండలి వెంకట కృష్ణారావు గారు వేయించిన తప్పటడుగులేకదా, ఈనాడు అదే రంగం లో ఆయన్ని పుణికి పుచ్చుకుని, తండ్రి అడుగు జాడల్లో, నడిచారు.  ఎందరికి కలుగుతుందీ అవకాశం!!  అక్టోబర్,      లో ఆంధ్రప్రదేశ్ బాలల మహాసభలు నారాయణ గుడా లోని కేశవ మెమోరియల్ హైస్కూల్ లో జరిగాయి.  

అపుడు బుద్ధ ప్రసాద్ గారు అన్నయ్య, అక్కయ్య గార్ల స్ఫూర్తితో అవనిగడ్డలో, దివిసీమ బాలానంద సంఘానికి అద్యక్షుడిగా ఉంటూ, "జబ్బు కుదిరింది" నాటిక ప్రదర్శింప జేయటం, ద్వితీయ బహుమతి సాధించుకోవటం జరిగింది.  ఆ మహాసభలో పన్నెండు వందల  మంది బాల ప్రతినిధులు రావటం, దసరా సెలవులు, కావటంతో చాలా అద్భుతంగా జరిగాయి.  బాలానందం సభ్యులందరూ పాల్గొనటం, భోజనాలు వండించి, వడ్డించటం లాటి పనులెన్నో చేయించటం, పాల్గొనటం జరిగింది.   ప్రొద్దుట బాలల సంబంధిత విషయాల మీద చర్చలు, సాయంత్రం సాంస్కృతిక  కార్యక్రమాలు, పుస్తక ప్రదర్శనలు  లాంటి వన్నీ ఎంతో ఘనంగా జరిగాయి.  అప్పటి ముఖ్య మంత్రి గౌ!! శ్రీ జలగం వెంగళరావు గారు స్వయానా రావటం, కృష్ణారావు గారు, పరమహంసగారు లాంటి వారంతా బాలానందానికి రావటం, జరుగుతున్న ఏర్పాట్లు పర్యవేక్షించటం, తల్లిదండ్రుల సంఘం వాళ్ళు తయారు చేసి, వడ్డించిన పచ్చళ్ళు (గోంగూర లాంటివి) ఆస్వాదించటం ఎంతో ఆత్మీయంగా, అబ్బురంగా జరిగిపోయాయి.               

అంతటి మేధావులు, అంత ఉన్నత ప్రభుత్వ పదవులలో ఉన్నవారు, నిరాడంబరంగా ఉంటూ, గడిపిన జీవితాన్ని అతి దగ్గరగా చూస్తూ పెరిగిన బుద్ధ ప్రసాద్ గారు కూడా అదే పంథాలో తనని తాను దిద్దుకోవటం జరిగిపోయింది.  తండ్రి గారు, రెడియో అన్నయ్యగారు - అక్కయ్య గారు లాంటి వారి నుంచి పుస్తకాలు చదవటం, సత్ సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకోవటం అలవడ్డాయి.  ఆయన తల్లిగారు కూడ రేదియో అక్కయ్యగారితో కలిసిపోయి, అంతా ఒకే కుటుంబంగా ఉంటూవచ్చారు.

           దివిసీమ ఉప్పెన వచ్చినపుడు ఈ కుటుంబం అంతా ఎంతో సేవ చేసారు, ధన సాయంతో సహా.  వీరితో కలిసి  బాలానందం నుంచి కూడ ఎంతో మంది బాలలూ, వారి తల్లిదండ్రులూ, బాలానందం కార్యకర్తలూ కూడా పాల్గొన్నారు.

పుస్తకాలు చదవటం, విజాఇనార్జన, కవులంటే గౌరవం, భాషాభిమానం, కళాభిమానం, ఆదరణ వారిని గౌరవించట, సత్కరించటం లాంటి వన్నీ చూస్తుంటే ఆయనలో ఓ యువ శ్రీ క్రిష్ణ దేవరాయల వారు కనిపిస్తారు!!

రేదియో అన్నయ్యగారి శత జయంతి ఉత్సవాల సంధర్భంలో "ప్రత్యేక తపాలా కవరు" ను తపాలా శాఖ వారు జారీ చేయటానికి కావలసిన అనుమతి తెప్పించటంలో ఎంతో దోహద పడ్డారాయన.  బుద్ధ ప్రసాద్ గారు, రేడియో అన్నయ్యగారి జాఇపిక  - వెండి నాణెం ఆవిష్కరించారు. ఇంతే కాక, బాల సాహిత్యవేత్త శ్రీ వెలగా వెంకటప్పయ్య గారిని రేడియో అన్నయ్య గారి జీవిత చరిత్ర రచన చేయించటం, దానిని పొట్టీ శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ అలనాటి ఉపకులపతి ఆచార్య శ్రీ జీ వి సుబ్రమణ్యం గారు తో చర్చించి విశ్వవిద్యాలయం ద్వారా ప్రచురింప జేసి శత జయంతి సందర్భంగా విడుదల చేయించారు.  ఇవన్నీ బుద్ధ ప్రసాద్ గారికి రేడియో అన్నయ్య-అక్కయ్య గార్ల మీద ఆయన కున్న గౌరవం, బాలానందం తో ఆయన కున్న అనుబంధాన్ని చాటుకున్నాయ్.  

ఆయనలో నిర్వహణా సామర్ధ్యాలు, నాయకత్వ లక్షణాలు మొగ్గ తొడుగుతున్న సమయమది - రేడియో అన్నయ్య-అక్కయ్య గార్ల ప్రోత్సాహంతో దివిసీమ బాలానందంలో ఎన్నో బాలల ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించటం, జిల్లా స్థాయిలో నాటిక పోటీలూ, రాష్ట్ర స్ఠాయిలో చిత్ర కళా పోటీలు  నిర్వహించటం,  బాల సాహిత్య ప్రచురణలు చేపట్టి "గోరంతదీపం", గేయం సంపుటి ప్రచురించటం, "అంధ్ర కేసరి" నృత్య  రూపకం ప్రదర్శించటం లాటి కార్యక్రమాలెన్నో తలపెట్టి, సాధించారు.

ఆయన ప్రేరణతో వేదికలెక్కి బిడియం పోగొట్టుకుని, చక్కగా మాట్లాడటం, వ్యాసాలు, చిట్టి గేయాలు వ్రాయటం, ప్రచురింప జేయటం అంతా అన్నయ్య-అక్కయ్య గార్ల చలవే!! ప్రోత్సాహమే!!

ఇనన్నీ కూడా ఆయన "వ్యక్తిత్వ వికాసానికి" తోడ్పడ్డాయని అంటారు బుద్ధ ప్రసాద్ గారు!!  అవన్నీ ఆయన్ని ఈనాడు ఉన్నత స్ఠానంలో, కల్తీ లేకుండా, నిలబెట్టగలిగాయి అని అతి నిరాడంబరంగా కూడా చెపుకుంటారు!!

చిన్ననాటి జయాలే పెద్దయ్యాక విజయాలై ఆదర్శ భావాలతో, ఉన్నతంగా ఎదగటానికీ, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే  గుణాన్ని అలవరచుకోటానికీ తోడ్పడతాయంటారాయన!!

బుద్ధ ప్రసాద్ గారి రెండవ బాల్యం ఆయురారోగ్య, ఐశ్వర్యాభి వృద్ది కలిగి సమాజ, రాష్ట్ర, దేశ సేవ చేస్తూనే ఉండాలని ఆశిస్తూ.........   
                                                                                                                                         ......  బాలానందం


డా.  జి. స్వర్ణబాల 
ఉప కార్యదర్శి
                                                                                                    



This article was published in the souvenir released on his 60th birthday on 27th May 2016

Courtesy:  Material given by Kamalakkayya garu, my writing fine-tuned at a few placed by our Balanandam Former Vice-President - Purnachandra rao garu and opportunity given by Papakka to write such a nice article and it is published in my name...................

thank you all for the opportunity!!